రెజాంగ్ల వార్: చరిత్రలో దాగిన 120 మంది యాదవ యోధుల అమర కథ!

rejlanga war in india

రెజాంగ్ల వార్: చరిత్రలో దాగిన 120 మంది యాదవ యోధుల అమర కథ!

యాద‌వ భార‌తం ఎద్దు మోతంత బ‌రువు. చెప్తే ఒడ‌వ‌దు..వింటే త‌ర‌గ‌దు. ఎందుకంటే మానవ నాగ‌రిక‌త నుంచి సంస్కృతి, సంప్ర‌దాయాలు, రాజ్యాల‌లో యాద‌వుల పాత్ర ఎన‌లేనిది.
అహిర్ రెజిమెంట్ గురించి మ‌నం తెలుసుకోవాలంటే ఈ 16వ శ‌తాబ్దంలో ఈస్టు ఇండియా కంపెనీ భార‌త‌దేశానికి వ‌చ్చిన‌ప్ప‌టి నుంచి చ‌ర్చించాల్సి ఉంటుంది. బ్రిటీష్ వారు భార‌త దేశాన్ని క‌బ్జా చేయాల‌నే ఉద్దేశంతో విభిన్న ప్రాంతాల‌ను ఎంచుకున్నారు. దానికి సైనిక బ‌లం అవ‌స‌రం కావ‌డంతో వారికి అనుకూలంగా ఉన్న వ‌ర్గాల‌ను రెజిమెంట్లుగా ఏర్పాటు చేసుకుంటూ ముందుకు వెళ్లారు. 17వ శ‌తాబ్దం నుంచి 1850 వ‌ర‌కు రెజిమెంట్ల ఏర్పాటు కొన‌సాగుతూ వ‌చ్చింది. ద‌క్షిణ ప్రాంతంలో మాద్రాస్ రెజిమెంట్‌, మ‌ధ్య‌ ప్రాంతంలో మ‌రాఠా రెజిమెంట్‌, ప‌శ్చిమ‌లో రాజ్‌పుత్ రెజిమెంట్‌, రాజ్‌పుతానా రైఫిల్స్‌, సిక్ రెజిమెంట్‌, జాట్ రెజిమెంట్‌, ఉత్త‌ర ప్రాంతంలో క‌మావోన్ రెజిమెంట్‌, గుర్కా రెజిమెంట్ మొత్తంగా 8 రెజిమెంట్ల‌ను ఏర్పాటు చేశారు. కానీ అహిర్ రెజిమెంట్ మాత్రం ఏర్పాటు చేయ‌లేదు.

1850 ద‌శ‌కంలో అహిర్ రెజిమెంట్ కోసం మొద‌టి పోరాటం..

రావ్ తులారాం అహిర్ హ‌ర్యానాలోని రేవ‌డి రాజ్యానికి రాజు. బ్రిటీష్ వారు అహిర్ రెజిమెంట్ ఏర్పాటు చేయ‌క‌పోవ‌డంతో, త‌న రాజ్యంలోని చుట్టుప‌క్క‌ల ఉన్న గ్రామాల్లో ధైర్యం, శౌర్యం క‌లిగిన అహిర్ సైనికుల‌ను స‌మీక‌రించాడు. రావ్ తులారాం అహిర్ బ్రిటీష్ వాళ్ల‌ని ప్ర‌శ్నిస్తూ మీరు ఏర్పాటు చేసుకున్న అన్ని రెజిమెంట్ల‌లో మా అహిర్‌లు(యాద‌వులు) సైనికులుగా ప‌నిచేస్తున్నారు. కానీ మీరు ఎందుకు అహిర్ రెజిమెంట్ ఎందుకు ఏర్పాటు చేయ‌లేద‌ని గ‌ట్టిగా నిలదీశాడు. దీనికి బ్రిటీష్ వారు స‌మాధాన‌మిస్తూ గ‌డిచిన 100 ఏళ్ల‌లో 8 రెజిమెంట్లు పూర్తి చేశాం. అహిర్ రెజిమెంట్ కూడా ఏర్పాటు చేస్తాం..సంయ‌మ‌నం పాటించండి అని తెలిపారు. రావ్ తులారాం గారికి అహిర్ రెజిమెంట్ ఎందుకు ఏర్పాటు చేయ‌ట్లేద‌నే ప్ర‌శ్న మ‌దిలో మెదులుతూనే ఉంది.

1857 తిరుగుబాటు..
స్వాతంత్ర్యం కోసం 1857లో జ‌రిగిన తిరుగుబాటు మీర‌ట్‌లో ప్రారంభ‌మైంది. సంవ‌త్స‌రం మీద ఆరు నెల‌లు జ‌రిగిన ఈ పోరాటంలో మొత్తంగా 6,000 మంది బ్రిటీష్ సైనికులు చ‌నిపోయారు. కానీ బ్రిటీష్ వారు 8 ల‌క్ష‌ల మంది భార‌తీయుల్ని చంపివేశారు. అందులో 25శాతం అహిర్ సైనికులు ఉన్నారు. ఈ తిరుగుబాటు త‌ర్వాత 1858లో బ్రిటీష్ వారు స‌మీక్ష చేసుకున్నారు. ఈ తిరుగుబాటుకు ముఖ్య కార‌ణం.. రావ్ తులారాం, కొత్వాల్ ధ‌న్ సింగ్ గుజ్జార్‌, రావ్ గోపాల్ సింగ్ యాద‌వ్‌.

రావ్ గోపాల్ సింగ్ యాద‌వ్ కూడా రేవ‌డి ప్రాంతానికి చెందిన రావ్ తులారాం అహిర్ సోద‌రుడు. ఈ ముగ్గురు కార‌ణ‌మ‌ని తెలుసుకున్న బ్రిటీష్ వారు హ‌ర్యానాలోని రేవ‌డిలో ఉన్న అహిర్వాల్ సామ్రాజ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. అహిర్స్ ను తిరుగుబాటు దారులుగా ముద్ర‌వేసి అహిర్ రెజిమెంట్ ఏర్పాటు చేయ‌వ‌ద్ద‌ని దృఢ సంక‌ల్పానికి వ‌చ్చారు. ఒక వేళ అహిర్ రెజిమెంట్ గ‌నుక ఏర్పాటు చేస్తే ఇది యుద్ధ జాతి ఏదో ఒక‌రోజు తిరుగుబాటు చేస్తుంద‌నే నిర్ణ‌యానికి వ‌చ్చారు. మొత్తానికి 1857 తిరుగుబాటును అణిచివేశారు. రావ్ తులారాం 1863 సెప్టెంబ‌ర్ 23న మ‌ర‌ణించ‌డం జ‌రిగింది. ఆ త‌ర్వాత కొన్నేళ్ల‌కు త‌న కుమారుడైన రావ్ యుధిష్ట‌ర్ సింగ్ యాద‌వ్ 1877లో అహిర్వాల్ ప్రాంత హెడ్ గా పున‌రుద్ధ‌రింప‌బ‌డ్డాడు. అత‌న్నిబ్రిటీష్ వారు పిలిచి బంధించి.. మీరు సేనాప‌తి అవుతారా, త‌హ‌సీల్దార్ అవుతారా.. అని అడిగారు. నేను సేనాప‌తి అవుతాన‌ని గ‌ర్వంగా చెప్పాడు. అప్పుడు బ్రిటీష్‌వారు మ‌ళ్లీ తిరుగుబాటు చేస్తారేమో అని గ్ర‌హించి, మేము అహిర్ రెజిమెంట్ ఏర్పాటు చేస్తాము దానికి మిమ్మ‌ల్ని సేనాప‌తి చేస్తాము అని వాగ్దానం ఇచ్చారు. అహిర్ రెజిమెంట్ ఏర్పాటు చేయ‌డం కోసం, అహిర్లంద‌రినీ ఏకతాటిపైకి తెచ్చేందుకు యుదిష్ట‌ర్ ప్ర‌య‌త్నం చేశాడు. అహిర్లు అంద‌రినీ అహిర్ రెజిమెంట్ ఏర్పాటు చేయ‌కుండా హైద‌రాబాద్ సంస్థానంలో క‌లిపారు. అహిర్ సైనికులు అహిర్ రెజిమెంట్ ఏర్పాటు చేస్తారా లేదా అని ప్ర‌శ్నించ‌డం మొదలు పెట్టారు. బ్రిటీష్ వారు స‌మాధాన‌మిస్తూ ప్ర‌పంచ యుద్ధం వ‌చ్చే అవ‌కాశాలు ఉన్నాయి. ఈ యుద్ధంలో గ‌నుక మ‌నం గెలిస్తే క‌చ్చితంగా అహిర్ రెజిమెంట్ ఏర్పాటు చేస్తామ‌ని, భార‌త‌దేశ స్వాతంత్ర్య ప్ర‌స్థానాన్ని కూడా బ్రిటీష్ మ‌హారాణి ముందు పెడుతామ‌ని తెల‌ప‌డం జ‌రిగింది. ఈ న‌మ్మ‌కంతో అహిర్ సైనికులంతా హైద‌రాబాద్ సంస్థానంలో క‌లువ‌డం ప్రారంభించారు.

1914 నుంచి 1918వ‌ర‌కు జ‌రిగిన మొద‌టి ప్రపంచ యుద్ధంలో 5 నుంచి 6 ల‌క్ష‌ల మంది భార‌త సైనికులు పాల్గొన్నారు. అందులో 74,000 మంది భార‌త సైనికులు ప్రాణ‌త్యాగం చేశారు. అందులో 7,700మంది యాద‌వ సైనికులు మ‌ర‌ణించారు. మొద‌టి ప్ర‌పంచ యుద్ధం త‌ర్వాత మ‌న‌కు ఏవైతే రెండు వాగ్దానాలు ఇచ్చారో దాని మీద మాట్లాడ‌డం మానేశారు. అందులో ఒక‌టి భార‌త స్వాతంత్ర్యం, మ‌రొక‌టి అహిర్ రెజిమెంట్‌.

హైద‌రాబాద్ రెజిమెంట్‌ను పూర్తిగా ఏర్పాటు చేశారు. అందులో

33శాతం జాట్ లు
33శాతం కుమావోన్‌
33శాతం యాద‌వులు ఉన్నారు.

అహిర్ రెజిమెంట్‌ను బ్రిటీష్ వారు ఇక ఏర్పాటు చేయ‌రు అని తెలుసుకున్న త‌ర్వాత‌…1924లో అఖిల భార‌త యాద‌వ మ‌హాస‌భ ఏర్ప‌డింది. మ‌హాస‌భ ఏర్ప‌డ్డ రోజునే అహిర్ రెజిమెంట్ కోసం ఒక క‌మిటీ ఏర్పాటు చేశారు. ఆ క‌మిటీకి రావ్ యుదిష్ట‌ర్ కొడుకు రావ్ బ‌ల్వీర్ సింగ్ యాద‌వ్ ను అధ్య‌క్షుడిగా ఎన్నుకున్నారు. ఈ క‌మిటీ 10 నుంచి 15 ఏళ్ల పాటు అంద‌రినీ చైత‌న్యం చేసేందుకు ప్ర‌య‌త్నించింది. అప్ప‌టి బ్రిటీష్ వైస్త్రాయ్ గా ఉన్న లార్డ్ ఇర్విన్‌, లార్డ్ వెల్లింగ్‌ట‌న్‌ల‌కు అహిర్ రెజిమెంట్ ఏర్పాటు చేయాల‌ని ఎన్నో సార్లు విన‌తిప‌త్రం స‌మ‌ర్పించారు.

1936 సంవ‌త్స‌రంలో లార్డ్ విల్లింగ్ ట‌న్‌, బ‌ల్వీర్ సింగ్ యాద‌వ్‌ను పిలిపించి, రెండో ప్రపంచ యుద్ధం ఎప్పుడైనా రావొచ్చు.. మీరు అధైర్య‌ప‌డ‌కండి అని, మీరు య‌ద్ధానికి మ‌ద్ద‌తు ప‌ల‌కాల‌ని కోరారు. ఇది 100శాతం మీకు ఇస్తున్న హామీ అని చెప్పాడు. 1939 నుంచి 1945 వ‌ర‌కు 6 సంవ‌త్స‌రాల పాటు న‌డిచిన యుద్ధంలో 8 నుంచి 9 ల‌క్ష‌ల మంది భార‌త సైనికులు పాల్గొన్నారు. అందులో 20 నుంచి 25శాతం మంది యాదవ సైనికులు. మొత్తం యుద్ధంలో 88వేల మంది భారత సైనికులు చనిపోతే అందులో 10వేల మంది యాదవ సైనికులు ఉన్నారు.

ఇందులో 18 మందికి అత్యుత్తమైన పురస్కారాలు దక్కాయి. అవి జార్జ్ క్రాస్, విక్టోరియా క్రాస్. ఈ సర్వోత్తమమైన పురస్కారాలలో ముగ్గురు యాదవ సైనికులు ఉన్నారు. బ్రిటీష్ వారు చేస్తున్న కుట్రలను పసిగట్టిన కొందరు దాదాపు 11వేల నుంచి 12వేల మంది యాదవ సైనికులు సుభాష్ చంద్రబోస్ ఏర్పాటు చేసిన ఆజాదీ ఫోర్స్ లో జాయిన్ కాసాగారు. బ్రిటీష్ వారికి వ్యతిరేకంగా కొనసాగిన పోరాటంలో జర్మనీ, జపాన్, ఇటలీ వారితో కలిసి యుద్ధం చేశారు. బ్రిటీష్ వారు మళ్లీ యాదవ జాతిని తిరుగుబాటు జాతి అని, ఏర్పాటు జాతి అని, దుష్ప్రచారం చేయసాగారు. యాదవులతో పాటు మిగతా కొన్ని కులాల వ్యక్తులను కూడా తిరుగుబాటు జాతులుగా దుష్ప్రచారం చేశారు.

1945 తర్వాత హైదరాబాద్ రెజిమెంట్ ను విడదీసి 33శాతం జాట్లను, 33 శాతం కుమావోన్లు, కుమావోన్ రెజిమెంట్లలో కలిపారు. స్వాతంత్ర్యం తర్వాత ఉత్తర ప్రదేశ్ లో యాదవులు ఎక్కువ సంఖ్యలో ఉండేవారు. ఉత్తర ప్రదేశ్ మొదటి ముఖ్యమంత్రిగా గోవింద్ వల్లభ్ పంత్ ఉండేవారు. అతను కుమావోన్ ప్రాంతానికి చెందినవాడు. అహిర్ లు తమతో పాటు ఉంటే కుమావోన్ రెజిమెంట్ కు మంచి పేరు ప్రఖ్యాతులు వస్తాయని అహిర్ రెజిమెంట్ కు అడ్డుపడ్డాడు.

1962లో రెజాంగ్ల యుద్ధం..

రెజాంగ్ల యుద్ధం భారత సైనిక చరిత్రలో జరిగిన అత్యంత వీరోచిత పోరాటాల్లో ఒకటిగా నిలిచింది. నవంబర్ 18, 1962 సంవత్సరంలో తెల్లవారుజామున 3.30 గంటలకు చైనా భారీ సైన్యంతో దాడి ప్రారంభించింది. రెజాంగ్ల లడఖ్ లోని చుషుల్ సెక్టార్ లో ఒక కీలకమైన ప్రాంతం. ఈ పాస్ లేహ్ కు దారితీసే మార్గంలో ఉంటుంది. దీన్ని కాపాడే బాధ్యత 13 కుమావోన్ రెజిమెంట్ లోని చార్లీ కంపెనీకి అప్పగించింది. మేజర్ సైతాన్ సింగ్ నాయకత్వంలో 120 మంది సైనికులు దాదాపుగా హర్యానా నుంచి వచ్చిన అహిర్ (యాదవ) సామాజిక వర్గానికి చెందిన వారు. చుషుల్ లోయ సముద్ర మట్టానికి 16వేల నుంచి 18వేల అడుగుల ఎత్తులో ఉంటుంది. ఈ ప్రాంతంలో మైనస్ డిగ్రీల చలి, ఆక్సిజన్ కొరత, రవాణా సౌకర్యం కొరత ఉంటుంది. భారత సైన్యం 120 మంది 3వేల నుంచి 5వేలు ఉన్న చైనా సైన్యంతో వీరోచితంగా పోరాడి 1300 పైచిలుకు మందిని చంపివేసింది. కానీ చైనావాళ్లు మాత్రం 774 మంది మాత్రమే మరణించారని ఆ దేశం బుకాయించింది. ఇందులో 114 మంది భారత సైనికులు మరణించడం జరిగింది. ఆరుగురు మాత్రమే గాయాలతో బయటపడ్డారు.

మేజర్ సైతాన్ సింగ్ నాయకత్వంలో భారత సైనికులు తమ ఆయధాలతో చావు చివరి వరకు పోరాడారు. మేజర్ సైతాన్ సింగ్ ఒక ప్లాటూన్ నుంచి మరొక ప్లాటూన్ కు వెళ్లి తన సైనికులను ఉత్సాహపరిచారు. ఆయన కడుపులో తీవ్రంగా గాయమైనప్పటికీ ప్రాణం పోయే వరకు కూడా పోరాటం చేశాడు. ఈ భయంకరమైన యుద్ధాన్ని భారత సైన్యానికి తెలిపేందుకు 120 మంది సైనికులలో ఒకరిని పంపించారు. ఇది తెలుసుకున్న భారత సైన్యాధిపతులు వీరు చేసిన పోరాటాన్ని చూసి, వారి శరీరాలను చూసి, వారి శౌర్యానికి, వారి యుద్ధ పరాక్రమానికి ఆశ్చర్యపోయారు.

ఈ సైనికులు వీర మరణానికి చిహ్నంగా అహిర్ ధామ్ ను ఏర్పరిచారు. హర్యానాలోని రేవడిలో కూడా వీరి పోరాటానికి చిహ్నంగా స్థూపాన్ని ఏర్పాటు చేశారు. ఈ పోరాటంలో మేజర్ సైతాన్ సింగ్ ను పరమవీర చక్ర, వీర చక్ర పురస్కారాలు లభించాయి. 1971లో కూడా పరమవీర చక్ర, వీర చక్ర పురస్కారాలు దక్కాయి. కార్గిల్ వార్ లో వీరోచితంగా పోరాడిన యోగేంద్ర సింగ్ యాదవ్ కు కూడా పరమవీర చక్ర పురస్కారం లభించింది. ఈ విషయాలన్నింటినీ కేంద్ర మంత్రి సర్దార్ స్వరణ్ సింగ్ గారిని కలిసి యాదవ మహాసభ నాయకులు వివరిస్తే యాదవుల పోరాటాన్ని చూసి ఆయన కళ్లుచెమర్చారు.

రాజకీయ కుట్రలతో, కుతంత్రాలతో అహిర్ రెజిమెంట్ ఏర్పాటు చేయకుండా ఇప్పుడున్న రాజకీయ పార్టీలు, నాయకులు అహిర్ రెజిమెంట్ కు అడ్డుపడుతున్నారు. అయినా కూడా అఖిల భారత యాదవ మహాసభ ఆధ్వర్యంలో దినేశ్ యాదవ్ కోఆర్డినేటర్ గా, చెట్టుకింది కిరణ్ కుమార్ యాదవ్ కోఆర్డినేటర్ గా వ్యవహరిస్తూ, అన్ని రాష్ట్రాల్లో తిరుగుతూ, యాదవులందరినీ చైతన్యం చేస్తూ లక్ష కిలోమీటర్ల కలశయాత్రకు శ్రీకారం చుట్టారు. నవంబర్ 18 , 2025 నాటికి రెజాంగ్ల దివస్ సందర్భంగా ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద భారీ బహిరంగ సభలో వీరి యాత్ర ముగియనుంది. భారత స్వాతంత్ర్య పోరాటంతో సమానంగా అహిర్ రెజిమెంట్ పోరాటం నడిచిన విషయాన్ని ప్రతి యాదవుడు తెలుసుకుని పదిమందిని చైతన్యం చేయాల్సిన సందర్భం ఇది.

(అహిర్ రెజిమెంట్ కోసం దేశ వ్యాప్తంగా రెజాంగ్ల కలశయాత్ర సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో నిర్వహించిన వ్యాసరచన పోటీల్లో ప్రథమ స్థానం సంపాదించిన వ్యాసం)

రచయిత
-నక్క మహేశ్ యాదవ్
9014384440

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top
en_USEnglish