ఎమ్మెల్యేలు లేరని మంత్రి పదవి ఇవ్వరా? : కుడా మాజీ చైర్మన్ సుందర్ రాజ్ యాదవ్

yadaav press meet

ఎమ్మెల్యేలు లేరని మంత్రి పదవి ఇవ్వరా? : కుడా మాజీ చైర్మన్ సుందర్ రాజ్ యాదవ్

యాదవ వికాసం: దేశ రాజకీయాల్లో కీలకపాత్ర పోషించడమే కాకుండా, రాష్ట్రంలో అత్యధిక జనాభా ఉన్న యాదవ జాతికి కేబినెట్ లో చోటు లేకపోవడం సిగ్గుచేటని అఖిల భారత యాదవ సంఘం సభ్యుడు, కుడా మాజీ చైర్మన్ సుందర్ రాజ్ యాదవ్ అన్నారు. బుధవారం హన్మకొండ రాంనగర్ లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి అఖిల భారత యాదవ సంఘం సభ్యులు రాజారాం యాదవ్, గోవర్ధన్ యాదవ్ తదితరులు హాజరయ్యారు. ఈనెల 30న హైదరాబాద్ లో జరిగే యాదవుల ఆత్మగౌరవ సభకు భారీసంఖ్యలో రావాలని పిలుపునిచ్చారు. అనంతరం కుడా మాజీ చైర్మన్ సుందర్ రాజ్ యాదవ్ మాట్లాడుతూ.. ఎమ్మెల్యేలు లేరనే సాకుతో యాదవ జాతిని వెనకబాటుకు గురిచేయవద్దని, వెంటనే మంత్రి పదవి కేటాయించాలని కోరారు. ప్రతీ జిల్లాలో, నియోజకవర్గంలో యాదవ కులస్తులు ఆవేదనతో ఉన్నారని చెప్పారు. నీతికి, నిజాయితీకి ప్రతీక యాదవ జాతి అని చెప్పే కాంగ్రెస్ పెద్దలు తక్షణమే మంత్రి పదవి ఇవ్వాలని డిమాండ్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి మంచి మనస్సుతో అలోచించి కులానికి పదవి కల్పించాలని విన్నవించారు. ఈనెల 30వ తేదీన యాదవుల ఆత్మగౌరవ సభ ఇందిరా పార్క్ లో నిర్వహిస్తున్నామని, యాదవ బిడ్డలంతా తరలివచ్చి సభను విజయవంతం చేయాలని పిలుపునించారు.

ప్రభుత్వానికి కనువిప్పు కలిగేలా..
యాదవ జేఏసీ ఆధ్వర్యంలో జూన్ 30న ఇందిరా పార్క్ లో యాదవ ఆత్మగౌరవ సభ నిర్వహిస్తున్నామని రాజారాం యాదవ్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వానికి కనువిప్పు కలిగేలా ఈ సభ ఉండబోతోందని పేర్కొన్నారు. సభను విజయవంతం చేయడానికి ఉమ్మడి వరంగల్ జిల్లా యాదవులు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్రంలో యాదవులకు మంత్రి పదవి లేకపోవడం దుర్మార్గపు చర్య అని అభివర్ణించారు.
హిందూ జాతికి భగవద్గీతను అందించిన జాతి యాదవ జాతి అని, తెలంగాణలో గోల్కొండను నిర్మించిన చరిత్ర యాదవ జాతిదని గుర్తు చేశారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం మళ్లీ భర్తీ చేయబోయే కేబినెట్ పదవుల్లో యాదవ జాతికి పెద్ద పీట వేయాలని కోరారు. అలాగే జనాభా ధమాషా పద్దతిలో యాదవులకు రావాల్సిన నామినేటెడ్ పదవులు ఇవ్వాలన్నారు. గతంలో బీఆర్ఎస్ హయాంలో జరిపిన సమగ్ర కుటుంబ సర్వేలో ముస్లింలు లేకుండా బీసీలు 52% ఉన్నారని, కానీ ఇప్పుడు ముస్లింలను కలుపుకొని 56% బీసీలు ఉన్నారని చెప్పడం సిగ్గుచేటన్నారు. కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం 42% స్థానిక సంస్థల్లో బీసీలకు అవకాశం కల్పించాలని కోరారు. యాదవులు, మున్నూరుకాపులు లేని మంత్రి మండలి ఉండటం బాధాకరమని పేర్కొన్నారు. కాంగ్రెస్ కు మున్నూరుకాపులు కే కేశవరావు, డీఏస్ లాంటి వారు ఎన్నో సేవలు చేశారని చెప్పారు. బీసీలకు మంత్రి మండలిలో సముచిత స్థానం కల్పించాలని బీసీ కులాల లెక్కన 9 మందికి చోటు కల్పించాలని కోరారు. యాదవులు ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న రెండో విడత గొర్రెల పంపిణీని వెంటనే చేపట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అనంతరం గోవర్ధన్ యాదవ్ మాట్లాడుతూ.. చరిత్రలో యాదవులు లేకుండా మంత్రి మండలి లేదని, యాదవ మంత్రి లేకుండా పాలన చేస్తున్న ఏకైక సీఎం రేవంత్ రెడ్డి అని ఎద్దేవా చేశారు. యాదవులను మరిచిపోతే కచ్చితంగా తగిన మూల్యం చెల్లిస్తారన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో యాదవుల సత్తా చాటుతామని హెచ్చరించారు. మేకల కృష్ణ యాదవ్ మాట్లాడుతూ.. అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ఇచ్చిన హామీలకు మొదటి అడుగు వేసి ఓట్లు వేసింది యాదవ జాతి బిడ్డలేనని గుర్తు చేశారు. యాదవులకు మంత్రి పదవి ఇవ్వకపోవడంలో కాంగ్రెస్ ఉద్దేశం చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో గోవర్ధన్ యాదవ్, గిరబోయిన రాజయ్య యాదవ్,మాదం రజనీ కుమార్, సిద్దిరాజు యాదవ్, గండ్రకోట రాకేశ్ యాదవ్, పృథ్వీ యాదవ్, ప్రమోద్ యాదవ్, సాయి యాదవ్, రాజు యాదవ్, బండి పర్వతాలు యాదవ్, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top
en_USEnglish