ఆటల్లో చిచ్చరపిడుగు..చదువుల్లో సరస్వతీ .. మోదీ మెచ్చిన యాదవ బిడ్డ!
ప్రతిభ ఎవరి సొత్తు కాదు.. సాధారణ కుటుంబంలో పుట్టిన అసాధారణ ప్రతిభ చాటుతారు కొందరు..కాసులు ఉంటేనే పేరు ప్రఖ్యాతులు వస్తాయనేది పాత మాట.. తెలివితేటలకు తోడు శ్రమను నమ్ముకుంటే కీర్తిప్రతిష్టలు అవే ఎదురొస్తాయి. మట్టిలో మాణిక్యాలకు ఊరి పెద్దల నుంచి దేశ ప్రధాని వరకు ప్రశంసలు రావాల్సిందే. అలాంటి ఘనతే దక్కించుకుంది మన యాదవ చిన్నారి. ఆమె తన అసాధారణ ప్రతిభతో ఏకంగా ప్రధాని మోదీ ప్రశంసలు దక్కించుకుంది. ఆమె తాడిబోయిన శ్రీలక్ష్మీ యాదవ్. మీ ఆట ద్వారా మీకే కాదు.. మొత్తం దేశానికి గౌరవాన్ని తెచ్చారని ప్రధాని మోదీ ఆమెకు లేఖ రాయడం.. చిన్నారి కఠిన శ్రమకు, అంకితభావానికి దక్కిన ప్రతిఫలం.

చిరుప్రాయంలో ఎన్నో ఘనతలు చాటుతున్న చిన్నారి శ్రీలక్ష్మీయాదవ్ తెలుగింటి అమ్మాయే. ఆంధ్ర ప్రదేశ్‌లోని గుంటూరు జిల్లా పెదకాకాని మండలం ఉప్పలపాడు గ్రామానికి చెందిన సాంఘిక నాటక రచయిత తాడిబోయిన తాతారావు యాదవ్, శాంతి యాదవ్ దంపతుల కుమార్తె శ్రీలక్ష్మీ యాదవ్. చిన్నతనం నుంచే చదువుతో పాటు ఆటపాటల్లోనూ చురుగ్గా ఉన్న శ్రీలక్ష్మీ ..ఫుట్ బాల్ క్రీడలో తన సత్తా చాటుతోంది. గతేడాది బీహార్ లో జరిగిన నేషనల్ ఫుట్ బాల్ క్రీడల్లో పాల్గొంది. అలాగే అనంతపురంలో జరిగిన ఫుట్ బాల్ నేషనల్ గేమ్స్ లో సత్తా చాటింది. ప్రధాని మోదీ ప్రవేశపెట్టిన వికసిత్ భారత్ ప్రోగ్రాంలో భాగంగా చేపట్టిన ప్రేరణ కార్యక్రమంలో గుజరాత్ లోని వడోదరలో వారం రోజులు మోదీ చదివిన స్కూల్ లో శిక్షణ తీసుకుంది. ఆగస్టు 15 స్వాతంత్ర్య దినోత్సవ కార్యక్రమంలో స్పెషల్ ఇన్వైటీ గా కేంద్ర ప్రభుత్వం ఆహ్వానం మేరకు పాల్గొని తెలుగు రాష్ట్రాలకు పేరు తెచ్చింది. క్రాఫ్ట్ సమస్త వారి సహకారంతో సహకారంతో ఢిల్లీలో జరిగిన బాలల హక్కులు, బాల కార్మికులు, బాల్యవివాహాలు సెమినార్ లో పాల్గొంది. ఇందులో ఆంధ్రప్రదేశ్ ప్రతినిధిగా ఎంపిక కావడం విశేషం.
గుంటూరు జిల్లాలో జరిగిన వినియోగదారుల దినోత్సవం సందర్భంగా జరిగిన డిబెట్ పోటీల్లో ప్రథమ స్థానం కైవసం చేసుకుంది. ఓటర్స్ డే సందర్భంగా జరిగిన కార్యక్రమంలో పాల్గొని గుంటూరు జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా సర్టిఫికెట్ అందుకుంది. స్కూల్ తరఫున జరిగిన జిల్లా స్థాయి కాంపిటీషన్లలో డీఈవో చేతుల మీదుగా మెమొంటో స్వీకరించింది. ఇలా ఆటల్లోనూ, చదువుల్లోనూ రాణిస్తూ కన్నవారికి , పుట్టిన ఊరికి పేరు తీసుకొస్తోంది. ఉప్పలపాడు జడ్పీ ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతున్న శ్రీలక్ష్మీయాదవ్… తన లక్ష్యం ఐఏఎస్ కావడమే అని చెబుతోంది. ఈమేరకు శ్రీలక్ష్మీయాదవ్ కు గుంటూరు జిల్లా యాదవ సంఘం వారు సహాయ సహకారాలు అందించారు. చదువుల్లోనూ, ఆటల్లోనూ తన అద్భుత ప్రతిభ, నిరంతర శ్రమతో మరిన్ని ఉన్నత శిఖరాలు చేరుకోవాలని తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, కుల బాంధవులు ఆకాంక్షిస్తున్నారు. సాధారణ కుటుంబానికి చెందిన చిన్నారి శ్రీలక్ష్మీ యాదవ్ లక్ష్య ఛేదనకు సహకారం, తోడ్పాటు అందించాల్సిన అవసరం ఉంది.
