(BC Resrvations) బీసీ రిజర్వేషన్లు..అసలేం జరుగుతోంది..? బీసీలు ఏం చేయాలి?..సీనియర్ వ్యాసకర్త అద్భుత విశ్లేషణ
(BC Resrvations) ‘ప్రజాస్వామ్యం అంటేనే సమస్త ప్రజల ప్రాతినిధ్యంతో కూడిన ప్రజా ప్రభుత్వం. ప్రాతినిధ్యం లేనిదే పన్నులు చెల్లించం..’ ఇది ప్రఖ్యాత అమెరికా విప్లవం నినాదం.స్వతంత్ర భారత దేశంలో 78 సంవత్సరాలు గడచినప్పటికీ బీసీలలో కొన్ని కులాలకు సరైన ప్రాతినిధ్యం లేదు.. కొన్ని కులాలకు అసలు ప్రాతినిధ్యమే లేదు.ప్రపంచంలో అతి పెద్ద ప్రజాస్వామ్య ప్రభుత్వంలో ప్రాతినిధ్యం కోసం బీసీ కులాలు ఉద్యమాలు చేయాల్సి వస్తోంది. భారత రాజ్యాంగంలో 15 (4),16 (4) 46, 243 డి,టి,338 బి,340 లాంటి ఆర్టికల్స్ బీసీల గురించి ప్రస్తావిస్తున్నప్పటికీ సరైన ప్రాతినిధ్యం కోసం బీసీలు ప్రజా పోరాటాలు చేస్తున్నారు. రాజ్యాంగంలో ఎటువంటి ఆర్టికల్స్ ప్రస్తావన లేనప్పటికీ, ఏ ఉద్యమం చేయనపట్టికీ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లపై ఒక వారం రోజుల్లోనే కేంద్ర క్యాబినెట్ నిర్ణయం తీసుకుంటుంది..పార్లమెంట్ ఆమోదిస్తుంది..రాష్ట్రపతి సంతకం అవుతుంది..న్యాయం కోసం సుప్రీంకోర్టుకు వెళితే కోర్టులు కూడా ఈ డబ్ల్యూ ఎస్ రిజర్వేషన్లు సమర్పిస్తాయి. కానీ బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల బిల్లును మాత్రం గవర్నర్ రాష్ట్రపతికి పంపుతారు..ఆర్డినెన్స్ కు గవర్నర్ సంతకం కాదు.. 50% క్యాప్ వర్తిస్తుంది, హైకోర్టు స్టే విధిస్తుంది. అది సుప్రీం కోర్టు సమర్థిస్తుంది.ఈ దేశంలో మెజార్టీలుగా ఉన్న బీసీలకు మాత్రం 78 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో సమ న్యాయం అందని ద్రాక్షగానే మిగిలిపోతోంది.
బీసీల 42 శాతం రిజర్వేషన్లకు మోక్షం లభిస్తుందా?
బీసీలకు విద్యా,ఉద్యోగ,స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్ల కోసం రాష్ట్ర ప్రభుత్వం కుల గణన చేపట్టి,డెడికేటెడ్ కమిషన్ ఏర్పాటుచేసి,ఎంపరికల్ డాటా ఆధారంగా శాసనసభ ఏకగ్రీవ ఆమోదంతో బిల్లులు గవర్నర్ దగ్గరికి పంపితే, వారు రాష్ట్రపతి దగ్గరికి పంపారు. రిజర్వేషన్ల కోసం ఆర్డినెన్స్ జారీ చేస్తే అది రాష్ట్రపతి దగ్గర పెండింగ్ లో ఉంది. పంచాయతీరాజ్ చట్ట సవరణతో జీవో 9 జారీ చేసి 42 శాతం రిజర్వేషను రాష్ట్ర ప్రభుత్వం కల్పించే ప్రయత్నాలు చేసింది. అయితే గతంలో ప్రస్తుత ప్రయత్నాలంతా స్పష్టంగా కాకపోయినా 1971లో అనంతరామన్ కమిషన్ ద్వారా తెచ్చిన బీసీ రిజర్వేషన్లను కోర్టు కొట్టి వేసింది. 1986లో మురళీధరన్ కమిషన్ సిఫారసుతో బీసీలకు తెచ్చిన 44 శాతం రిజర్వేషన్లు కోర్టు కొట్టివేసింది. ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వానికి గత అనుభవాలు ఉన్నా కూడా ప్రస్తుత ప్రయత్నంలో హైకోర్టు మధ్యంతర స్టే ఇచ్చిందంటే,సుప్రీం కోర్టు స్టేను సమర్ధించిందంటే రాష్ట్ర ప్రభుత్వ ప్రయత్నంలో ఎక్కడో లోపం ఉండి ఉంటుంది. సుప్రీం కోర్టు కృష్ణమూర్తి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో స్థానిక సంస్థల రిజర్వేషన్లకు సంబంధించి ట్రిపుల్ టెస్ట్ విధానాన్ని పేర్కొంది. ఈ తీర్పు ప్రకారం డెడికేటెడ్ కమిషన్ ఏర్పాటు చేసి,ఎంపరికల్ డేటాను సేకరించి 50 శాతానికి మించకుండా బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వవచ్చు. ప్రత్యేక పరిస్థితులలో 50% కి మించి రిజర్వేషన్లు ఇవ్వవచ్చు.రాష్ట్ర ప్రభుత్వం డెడికేటెడ్ కమిషన్ ఏర్పాటు చేసింది..కానీ ఎంపిరికల్ డాటాను పబ్లిక్ డొమైన్లో ఉంచాల్సి ఉండే. ప్రత్యేక పరిస్థితుల్లో 50% క్యాప్ ను క్రాస్ చేయవచ్చు అనే వెసులుబాటు ఉంది. కాబట్టి 42% రిజర్వేషన్లకు ప్రత్యేక పరిస్థితులు ఉన్నాయనే విషయాన్ని బలంగా వినిపించాల్సిఉండే.
రాష్ట్రం మొత్తానికి ఒక యూనిట్ గా తీసుకోకుండా జిల్లాను లేదా రెవెన్యూ డివిజన్ ను లేదా మండలాన్నీ ఒక యూనిట్ గా తీసుకొని రిజర్వేషన్లు నిర్ణయించి ఉండాల్సింది. అలాకాకుండా రాష్ట్రం మొత్తాన్ని ఒక యూనిట్ గా తీసుకొని 42% రిజర్వేషన్లు కల్పించడం కోర్టు మధ్యంతర స్టే ఇవ్వడానికి ఒక కారణం అయ్యి ఉండొచ్చు. ప్రస్తుతం బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు త్రిశంకు
స్వర్గంలో ఉండిపోయాయి. హైకోర్టు తుది తీర్పులో ఈ రిజర్వేషన్లను సమర్థిస్తుందా లేదా కొట్టివేస్తుందా?. కొట్టివేస్తే రాష్ట్ర ప్రభుత్వం పాత రిజర్వేషన్లతోనే ఎన్నికలకు వెళ్తుందా లేదా పార్టీ పరంగా 42 శాతం రిజర్వేషన్లు ఇస్తుందా? పార్టీపరంగా రిజర్వేషన్లను అన్ని పార్టీలు అనుసరిస్తాయా లేదా గెలుపు గుర్రాలకే టికెట్లు ఇస్తాయా? ఇలాంటి ప్రశ్నలతో యావత్ బీసీ సమాజమే త్రిశంకు స్వర్గంలో తెలియాడుతుంది. ప్రయత్నంలో కొన్ని లోపాలున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సినా ప్రయత్నం చేసింది.
శాశ్వత పరిష్కారం ఏమిటి?
బీసీలకు 42 శాతం స్థానిక సంస్థల్లోనే కాకుండా విద్యా,ఉద్యోగాల్లో కూడా రిజర్వేషన్లు సాధించాలంటే రాజ్యాంగ సవరణ చేసి తొమ్మిదో షెడ్యూల్లో చేర్చడమే పరిష్కారం. 10% ఈ డబ్ల్యూఎస్ రిజర్వేషన్లతో 50% క్యాప్ దాటినప్పటికీ సుప్రీంకోర్టు కొట్టి వేయలేదంటే రాజ్యాంగ సవరణ వల్లే సాధ్యపడ్డది. ఇప్పుడు 42% బీసీ రిజర్వేషన్లు కూడా రాజ్యాంగ సవరణ ద్వారా ఇస్తూ కోర్టు తీర్పుల నుంచి రక్షణ కోసం 9 షెడ్యూల్లో చేర్చాలి. సమాజంలో మెజార్టీలుగా ఉన్న బీసీ కులాల ఆకాంక్షలకు పార్లమెంటు రాజ్యాంగ సవరణ ద్వారా చట్ట రూపాన్ని ఇవ్వాలి.. న్యాయవ్యవస్థ సమీక్ష నుంచి కాపాడుటకు 9వ షెడ్యూల్లో చేర్చాలి.
మరొక తెలంగాణ ఉద్యమం రావాలి
ప్రస్తుతం బీసీ 42% రిజర్వేషన్లనే ప్రజా ఆకాంక్ష.. ఇటు శాసన వ్యవస్థ అటు న్యాయవ్యవస్థ మధ్య నలిగిపోతోంది. మెజార్టీ ప్రజల ఆకాంక్షలకు చట్ట రూపం కావాలంటే,వాటిని న్యాయవ్యవస్థ సమర్థించాలంటే రాజ్యాంగంలో బీసీల 42% రిజర్వేషన్లకు స్థానం కల్పించాలి. ప్రజాకాంక్షలకు పార్లమెంట్ అంగీకరించాల్సిన పరిస్థితినీ ఏర్పరచాలి. పార్లమెంటులో కేవలం ఇద్దరు ఎంపీలు మాత్రమే ఉన్నప్పటికీ తెలంగాణ ఉద్యమం ఎలా తన ఆకాంక్షలను సాధించుకుందో అలాంటి మరో ప్రజా ఉద్యమం రావాలి. బీసీ సమాజంలో ఐక్య ఉద్యమాలు అవసరం. బీసీ జేఏసీ లో ఐక్యత అవసరం.బీసీ సమాజానికి శత్రువులు ఎవరో,మిత్రులు ఎవరో తెలుసుకోకుండా పార్టీ అనుబంధ ఉద్యమాలు చేస్తే అది ప్రజా పోరాటాలుగా ఎలా మారుతాయి? బీసీ సమాజానికి ఒక తాత్విక పునాది లేకుండా,బీసీ భావజాలం విస్తృత పరచకుండా ఉద్యమాలు చేపడితే అవి నీటి బుడగలుగానే ఉంటాయి. తాత్విక పునాదుల మీద భావజాలం విస్తృత పరచడంపై ప్రజా ఉద్యమాలు నిర్మించబడతాయి.తెలంగాణ ఉద్యమం వలే బలమైన ప్రజా ఉద్యమాలు ప్రజల ఆకాంక్షలను వ్యక్త పరుస్తాయి. ప్రజాస్వామ్యంలో ప్రజా ఆకాంక్షల మేరకు పార్లమెంటు రాజ్యాంగ సవరణ చేయాల్సి వస్తుంది. న్యాయవ్యవస్థ రాజ్యాంగ విలువలకు,పార్లమెంటు చట్టాలకు మధ్య ఎక్కడో ఒక దగ్గర సయోధ్య సాధిస్తుంది. ఈ విధంగా బీసీలు 42 శాతం రిజర్వేషన్లు సాధించాలంటే తెలంగాణ ఉద్యమ లాంటి మరో ప్రజా ఉద్యమం ఈ బీసీ సమాజం తీసుకురావాలి.

-జుర్రు నారాయణ యాదవ్,
ఇంటలెక్చువల్ ఫోరం,
మహబూబ్ నగర్
9494019270.
